వేసవి సరదాలు- తమాషాలు!
వేసవి కాలం-ఊరగాయల కాలం, తెలుగు వంటిళ్లు చాలా సందడిగా ఉండే సమయం...
ఈ రోజుల్లో ఊరగాయలు పెట్టడమూ తక్కువే, తినడం తక్కువే;ఎలాగూ రొటిపచ్చళ్ళు ఉంటాయిగా.
నాలుగు కాయలతో ముక్కలు కారంలో వేసుకుంటే భేషూగ్గ రెండు నెలలు నెట్టేయచ్చు! ఈ లోపు ఎలాగూ ఇక్కడ వాతావరణం చల్లపడుతుంది (అన్నట్టు మేముండేది బెంగళూరులో)
తెలుగు ప్రాంతాల్లో-మండుటెండలు,మామిడి పళ్ళతో సందడి.
అబ్బో ఎన్ని రకాలు అనుకున్నారు!!! రసాలు-చిన్న రసాలు, పెద్ద రసాలు, చెరుకు రసాలు, కోటిపల్లి కొబ్బరి, ఇమామ్ పసందు,బంగినపల్లి-మామిడి పళ్ళలో రారాజు!
ఆ రుచే వేరు- ఆ రుచులన్నీ గత ఐదు సంవత్సరాలు గా మిస్ అవుతూనే ఉన్నాం- ఏదో వేసవిలో హైద్రాబాద్ వెళ్తే తప్ప- ఏదో వంకన ప్రతీ ఏడాది ఆ సమయంలో వెల్తూనే ఉన్నాననుకోండి-పనిలోపనిగా నాలుగు లాగించేసి వచ్చేటప్పుడు కార్లో వేసుకుని రావడం;ఇక్కడ మనవాళ్లకి కూడా కాసిన్ని పంచడం!రోజూ అట్టడబ్బా తీయడం- పండాయో లేదో అని చూడటం, ఏ రోజు పండినవి ఆ రోజు తినేయడం షరా మామూలే.
ఏదైనా బెజవాడలో ఉన్నవాళ్లు అదృష్ట వంతులు వేసవిలో-అటు ఉభయగోదావరిలోని రకాలు; నూజివీడు రకాలు అన్నీ తాజాగా తినొచ్చు. ఆ ఎండలు మాత్రం కాదండోయ్- అక్కడ నుంచి పెరిగేత్తుకొని పారిపోవాలి అనిపిస్తుంది ఆ ఎండ మంటలకి.
పుట్టి పెరిగింది ఆ ప్రాంతం అయినా, ఉద్యోగ రీత్యా, బ్రతుకు తెరువు రీత్యా రాజధాని నగరానికి (ఆ రోజుల్లో మాటలెండి) హైద్రాబాద్ వాతావరణంకి అలవాటు పడ్డాం కదండీ.అందునా ఐదు సంవత్సరాలుగా మకాం బెంగళూరు లో నాయే-అదీ సంబడం! ఏమిటో ఆ రోజుల్లో “గార్డెన్ సిటీ” అనే వారు- ఇప్పుడు మాత్రం “ట్రాఫిక్జాముల సిటీగా” మారిపోయింది!
ఇప్పటి కుర్రకారుకి, ఐ.టి వాళ్ళకూ ఈ తిళ్ళు అక్కరలేదుగా.పిజ్జాలు, పిజ్జా హట్లు, పాస్తాలు, మేక్డీలు.ఉదయం లేచింది మొదలు పడుకునే వరకూ- వీళ్ళే నలుడూనూ, నల పాకాలూనూ.ఎప్పుడో వీళ్ళే “ఆవకాయ బర్గర్లు, మాగాయ పాస్తాలు” చేసేస్తారు, పేటెంట్ కూడా తీసుకుంటారు కూడా."మన వాళ్లు వెఱ్ఱి వెంగళాయిలో" అని గిరీశం అన్నట్టు గుర్తు ఎప్పుడో! మనం వెర్రివెంగళప్పల్లా కూర్చుంటాం- భారతీయులం కదా! అమెరికావాడు ఏది చెప్పినా, చేసినా మనం వాడితో పాకిపోతాం, వాడు చెప్పిందే గొప్ప, అదేమాట వాళ్ళ అమ్మా, నాన్న, తాత, మామ్మో, బామ్మో చెపితే గయ్యిన లేస్తారు!
ఇంకా ఎక్కువగా అంటే నామీద ఒంటికాలి మీద లేస్తారు; నాకెందుకు,వాళ్లగోలవాళ్ళది.
నా సోది నా బాధ అలా ఉండనిచ్చి, ఆంధ్రా, తెలంగాణాలో ఉన్న వాళ్ళు ఎంచక్కా మామిడి పళ్లు, ఊర గాయలు ఎంజాయ్ చేయండర్రా!
లాక్ డౌన్ అయినా అన్నీ డోర్ డెలివరీ ఉన్నాయి కదా ఈ రోజుల్లో!
"ఇంక కబుర్లు ఆపి కొద్దిగా ఇంట్లో పనిలో ఒకింత చెయ్యి వెయ్యమని" మా ఆవిడ కేక వినపడుతోంది!